Saturday, 25 November 2017

metro


మెట్రో రైలుబండి... వస్తోందండి..!
ఆ రైలెక్కితే కింద వెళ్లే బస్సుల్నీ మనుషుల్నీ చూడొచ్చు. ‘అదిగో బిర్లామందిర్‌... ఇటు అసెంబ్లీ... అరే అప్పుడే నాంపల్లి స్టేషన్‌ వచ్చేసిందే...’ అని ఆశ్చర్యపోతూ చల్లని ఏసీ కోచ్‌లో కూర్చుని హైదరాబాద్‌ అందాలన్నీ చూసేయొచ్చు. నగరం ఆ చివర నుంచి ఈ చివరకు గంటలో దూసుకెళ్లిపోవచ్చిక. నిజానికిది మామూలు రైలూ కాదు, అలా అని బస్సూ కాదు... పొడుగు బస్సులా కన్పిస్తూ పట్టాల మీద నడిచే పొట్టి రైలిది. మొత్తానికి రోడ్డు‘పైకి’ వచ్చిన రైలిది!త్వరలో పట్టాలెక్కబోతున్న ఈ మెట్రో మ్యాజిక్‌ చూద్దాం రండి.
ల్లు మారాలనుకుంటున్నాం. మీ ఏరియాలో ఏమన్నా ఉంటే చెప్పండి.’
‘డబుల్‌ బెడ్‌ రూమ్‌ చాలు కదా. అద్దె ఎంతవరకూ పెడతారు?’
‘అద్దె కాస్త ఎక్కువైనా పర్వాలేదు. మెట్రో స్టేషన్‌కి దగ్గరగా ఉంటే చాలు.’
* * *
‘మీవాడు హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కున్నాడట. ఎంతైందేమిటి?’
‘డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లే నలభై లక్షలు దాటింది. సిటీ సెంటర్‌ కూడా కాదు కానీ మెట్రో స్టేషన్‌ దగ్గరే ఉందట, అందుకని రూపాయి కూడా తగ్గలేదు బిల్డరు.’
* * *
‘మామయ్యా హైదరాబాద్‌ వస్తున్నా. కొత్త ఇంటికెలా రావాలో అడ్రస్‌ చెప్పు’
‘దిల్‌సుఖ్‌ నగర్‌ తెలుసు కదా నీకు. అక్కడికి వచ్చాక సరిగ్గా 156 నంబరు మెట్రో పిల్లర్‌ దగ్గర ఎడమ పక్క సందులోకి తిరుగు. నేరుగా ఒక ఫర్లాంగ్‌ వచ్చాక కుడిచేతి పక్కన స్కూలు కన్పిస్తుంది. దాని పక్క బిల్డింగే...’
* * *
భాగ్యనగర వాసులు ఇప్పుడు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఇప్పుడు అన్ని పనులకూ మెట్రోతోనే లింకు. ఇప్పటికే హైదరాబాద్‌ నగర స్వరూపాన్ని మార్చేసిందీ మెట్రో. ఇక జీవనవిధానాన్నీ మార్చబోతోంది. గతుకుల్లేని రోడ్లూ... వేళకు వచ్చే బస్సులూ...ట్రాఫిక్‌ జాములు లేని కూడళ్లూ... ఇవి తరతరాలుగా హైదరాబాదీల తీరని కోరికలు. ఇవి చాలవన్నట్లు కొందరి అస్తవ్యస్తమైన డ్రైవింగ్‌ అలవాట్లూ హఠాత్తుగా రోడ్డుమీద ప్రత్యక్షమయ్యే జంతువులూ... వాహనాలు నడిపే వారికి బీపీ తెప్పిస్తాయి. ఫలితం... అటు ఆఫీసుకూ ఆలస్యం. ఇటు ఒళ్లూ హూనం.
తీరా అలసి సొలసి ఇంటికొస్తే... స్కూలుకెళ్తున్న బుజ్జిగాడికి పెన్నో పుస్తకమో కావాలి. పసిదానికి పాలో హార్లిక్సో కొనాలి. మామగారికి మందుబిళ్లలూ రేపటికి కూరగాయలూ... అంటూ చేతిసంచీ అందిస్తుంది ఇల్లాలు. ఉసూరుమంటూ మళ్లీ రోడ్డెక్కక తప్పదు సగటు నగరజీవికి.
ఈ చిక్కులన్నిటికీ పరిష్కారం... మెట్రో! చక్కగా ఏసీలో కుదుపుల్లేని ప్రయాణం. తల చెరగకుండా, దుస్తులు నలగకుండా ఆఫీసుకు వెళ్లిరావచ్చు. తిరుగు ప్రయాణంలో స్టేషన్‌లోనే కావలసినవన్నీ కొనేసుకుని ఇంటికి చేరుకోవచ్చు. కాసేపు స్టేషన్‌ ఆవరణలోనే చెట్టుకింద బెంచీ మీద కూర్చుని దోస్తులతో ముచ్చట్లూ చెప్పుకోవచ్చు. మెట్రో రైళ్లు తిరగడం మొదలెడితే హైదరాబాదీల దినచర్యలో వూహించని మార్పులు రానున్నాయి. తొలిదశ మెట్రో త్వరలో ప్రారంభం కాబోతున్న సందర్భంగా ఆ విశేషాలు...
మెట్రో... ఎందుకూ ఏమిటీ!
టువెళ్లినా ఏదో ఒక చారిత్రక ఆనవాలు కన్పించే హైదరాబాద్‌లో గత కొన్ని దశాబ్దాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకాశహర్మ్యాలూ విశాలమైన రోడ్లూ ఫ్లైఓవర్లతో నగర ముఖచిత్రం మారిపోయింది. నగరానికి సైబరాబాద్‌ అనుబంధమైంది. ప్రపంచ స్థాయి సంస్థలెన్నో నగరంలో తమ చిరునామా ఏర్పరచుకున్నాయి. ఐటీ, ఫార్మా, బయోటెక్‌, టూరిజం రంగాల్లో వేగంగా అభివృద్ధిని నమోదు చేస్తున్న నగర జనాభా ఇప్పటికే కోటి దాటుతోంది.
పట్టణీకరణా జనాభా పెరుగుదలా ప్రపంచమంతటా ఉన్న సమస్యే. దాని వల్ల నగరాల్లో వాహనాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగి రహదారులు ఇరుకైపోతున్నాయి. ట్రాఫిక్‌ జాములతో గమ్యం చేరడానికి గంటలు పట్టేస్తోంది. వీటిని అధిగమించడానికి ఏం చేయాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. రవాణా సాధనాల అభివృద్ధితో పాటూ అదీ పెరుగుతూ వచ్చింది. 150 ఏళ్ల క్రితమే ప్రత్యేకమైన మార్గంలో సాఫీగా ప్రయాణం సాగించేందుకు లండన్‌ అండర్‌గ్రౌండ్‌ ఏర్పాటైంది. ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ వ్యవస్థగా పేర్కొనే ఆధునిక రవాణా సాధనాలన్నిటికీ అదే మూలం. అప్పట్లో రైళ్లు స్టీమ్‌ ఇంజిన్‌తో నడిచేవి కాబట్టి భూగర్భంలో వెళ్తున్నప్పుడు సమస్యలు ఎదురయ్యేవి. క్రమేణా విద్యుత్‌ వాడకం వచ్చాక పూర్తిగా భూగర్భ రవాణా సులువైంది. ఒకేసారి ఎక్కువ మంది ప్రయాణికులను చేరవేసే ‘మాస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌’గా మెట్రోకి ఆదరణ ఎక్కువ. నిజానికి ‘మెట్రో’ అన్న పదానికి మూలం మెట్రోపాలిటన్‌. నగరాలకు ప్రత్యేకించిన రవాణా వ్యవస్థ కాబట్టి ‘మెట్రో’ అన్న పదం స్థిరపడిపోయింది. అమెరికాలో దీన్నే ‘సబ్‌వే’ అంటున్నారు. ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువగా ఇలాంటి ప్రయాణ వ్యవస్థలు ఉన్నది చైనాలో. అన్నిటికన్నా బిజీగా ఉండే వాటిల్లో టోక్యో సబ్‌వే, సియోల్‌ మెట్రోపాలిటన్‌ సబ్‌వే, మాస్కో మెట్రో, బీజింగ్‌ సబ్‌వే, షాంఘై మెట్రోలున్నాయి. మనదేశంలో ఇప్పటికే తొమ్మిది నగరాల్లో మెట్రో రైలు సర్వీసులు పనిచేస్తున్నాయి. పదోదే హైదరాబాద్‌ మెట్రో. దేశంలో ఇంకా పలు నగరాల్లో మెట్రో నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అవకాశాన్ని బట్టి మెట్రో నిర్మాణాన్ని మూడు రకాలుగా చేపట్టవచ్చు. పూర్తిగా భూగర్భంలో, ప్రత్యేకమైన మార్గంలో భూమి మీద, లేదా హైదరాబాదులో నిర్మించినట్లు ఎత్తుగా ఆకాశంలో.
మన మెట్రో ప్రత్యేకతలివి!
హైదరాబాద్‌ మెట్రోకి పలు విశేషాలున్నాయి.
ఒంటి స్తంభం వయాడక్ట్‌లతో వినూత్నమైన డిజైను. ఇప్పటివరకు పనిచేస్తున్న మెట్రోలన్నిటిలోకీ అత్యంత ఆధునికమైన వ్యవస్థ.
ప్రాజెక్టు ఖర్చు దాదాపు రూ.20 వేల కోట్లు.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ అతి పెద్ద ప్రాజెక్టును ఎల్‌ అండ్‌ టీ సంస్థ నిర్మిస్తోంది.
మూడు కారిడార్లు, 72 కి.మీ.
మియాపూర్‌- అమీర్‌పేట, అమీర్‌పేట- నాగోల్‌ మార్గాలు(మొత్తం కలిసి 30కి.మీ.) ప్రారంభానికి సిద్ధం. ఒకేసారి ఇంత పొడవు మార్గం ప్రారంభించడమూ దేశంలో ఇదే మొదటిసారి.
పది నిమిషాలకో రైలు. రద్దీగా ఉన్నప్పుడు మూడు నిమిషాలకో రైలు నడుపుతారు.
సగానికి పైగా ప్రయాణ సమయం ఆదా. రోడ్డు మీద ప్రయాణానికి గంటన్నర పైగా పడితే మెట్రోలో 40 నిమిషాలకే చేరుకోవచ్చు.
ఒక్కో ట్రైనుకీ మూడు కోచ్‌లు. అవసరమైతే అదనపు కోచ్‌లు జతచేసే సౌలభ్యం. అంతా ఏసీ. ట్రైన్‌లో దాదాపు వెయ్యిమంది ప్రయాణించవచ్చు. 126 మంది మాత్రమే కూర్చునీ మిగిలినవారంతా సౌకర్యంగా నిలబడీ ప్రయాణించవచ్చు.
ఏ స్టేషన్‌ వచ్చిందీ రాబోయే స్టేషన్‌ ఏదీ అన్న విషయం రైల్లో మూడు భాషల్లో ఎప్పటికప్పుడు ప్రకటన విన్పిస్తుంటుంది.
మొబైల్‌, ల్యాప్‌టాప్‌ ఛార్జింగ్‌ సౌకర్యం ఉంటుంది.
ఒక్కో స్టేషన్‌లో 20 సెకన్లు మాత్రమే ఆగుతుంది. స్మార్ట్‌ కార్డుతోనే లోనికి ప్రవేశం.
పొద్దున్నే మొదటి రైలు 5.30గంటలకు, రాత్రి చివరి రైలు 11.30 గంటలకు.
విద్యుత్తుతో నడుస్తుంది. కరెంటు పోతే ప్రయాణానికి ఆటంకం ఏర్పడకుండా వెంటనే జనరేటర్లు పనిచేస్తాయి. అధునాతన బ్రేకింగ్‌ వ్యవస్థ వల్ల ఈ రైలుకి బ్రేక్‌ వేసినప్పుడు విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. దాన్నీ వినియోగిస్తారు. స్టేషన్లలో సౌరవిద్యుత్తును వినియోగిస్తారు.
కిలోమీటరుకు ఒక స్టేషన్‌ ఉంటుంది. మొత్తం స్టేషన్లు 64. తొలి విడతలో 24 అందుబాటులోకి వస్తాయి.
57 రైళ్లు సిద్ధంగా ఉన్నాయి.
‘నిజ్‌’... మెట్రో మస్కట్‌!
హైదరాబాద్‌ మెట్రో రైల్‌కీ ఒక చిహ్నం ఉంది. దాని పేరు ‘నిజ్‌’. నగరాన్ని పాలించిన నిజాం రాజును గుర్తు చేస్తూ ఈ పేరు పెట్టారు. ‘నిజ్‌’ని ఓ గుర్తుగా మాత్రమే కాదు, హైదరాబాదీ యువతరానికి ప్రతీకగా చూపిస్తూ ఆ పాత్రకి ఓ కథ కూడా అల్లారు మెట్రో అధికారులు. దాని ప్రకారం నిజాం వారసుల కుటుంబంలో 1985లో పుట్టిన నిజ్‌ దిల్లీ ఐఐటీలో ఇంజినీరింగ్‌ చదివాడు. అమెరికా వెళ్లి అక్కడి కొలంబియా యూనివర్శిటీలోని ప్రతిష్ఠాత్మక గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌, ప్లానింగ్‌ అండ్‌ ప్రిజర్వేషన్‌లో అర్బన్‌ ప్లానింగ్‌లో మాస్టర్స్‌ పట్టా పొందాడు. కుటుంబాన్నీ స్వదేశాన్నీ వదిలి ఎక్కువకాలం దూరంగా ఉండలేని ‘నిజ్‌’ తాను చదివిన చదువుని సొంత వూరిలో తోటి ప్రజలకోసం ఉపయోగించాలని తిరిగి హైదరాబాద్‌ వచ్చేశాడన్న మాట. మూలాలనూ సంస్కృతినీ మరవని ఈ టెకీకి స్టీవ్‌ జాబ్స్‌ అంటే ఇష్టమట. హైదరాబాద్‌ చరిత్రను ఎంత ఇష్టపడతాడో అంతగా ఆధునిక ప్రగతిశీల దృక్పథాన్నీ అనుసరిస్తాడు. ఉల్లాసమూ నైపుణ్యమూ సామర్థ్యమూ ప్రతిఫలించే ఈ ‘నిజ్‌’ అనే యువకుడు ఇప్పుడు హైదరాబాదీ మెట్రో కల్చర్‌కి ప్రతినిధీ అదృష్టచిహ్నమూనన్న మాట! చేతిలో రాజదండం లాంటిది పట్టుకుని ‘నిజ్‌’ వేషంలో ఓ వ్యక్తి ప్రతి మెట్రో స్టేషన్‌లోనూ ప్రయాణికులకు దారిచూపిస్తాడట.
కంట్రోల్‌ @ ఉప్పల్‌
హైదరాబాద్‌లోని మొత్తం మెట్రో రైలు వ్యవస్థ నియంత్రణా ఒకే చోట ఉంటుందంటే నమ్మగలరా? అవును, ఉప్పల్‌ డిపోలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచీ అత్యాధునిక వ్యవస్థ ద్వారా నగరంలో వందల ట్రిప్పులు తిరిగే 57 మెట్రో రైళ్లనీ నియంత్రిస్తారు. సాంకేతిక లోపాలు వస్తే చక్కదిద్దే వ్యవస్థ కూడా ఇక్కడే ఉంది. అందుకుగానూ అక్కడో పెద్ద కార్యాలయమూ వందలాది మంది ఉద్యోగులూ ఉంటారనుకుంటే పొరపడినట్లే. కేవలం 40 మంది నిపుణులు ఈ పని అంతా చేస్తారు. మెట్రో రైలుకి ముందూ వెనకా ఆటోమేటిక్‌ ట్రైన్‌ ఆపరేషన్‌ వ్యవస్థ ఉన్న రెండు ఇంజిన్లుంటాయి. వాటిలో చెరో డ్రైవరూ ఉన్నా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ అజమాయిషీలోనే రైళ్లు నడుస్తాయి. నగరంలో నడుస్తున్న రైళ్లన్నిటినీ వారు ఇక్కడినుంచీ చూడగలుగుతారు. రైలులో ఏదైనా సాంకేతిక లోపం వస్తే సరిదిద్దడంతో మొదలుపెట్టి రైళ్లు ఢీకొనకుండా చూడడం వరకూ అన్నీ ఇక్కడినుంచే జరుగుతాయి. రైళ్లను పరీక్షించడానికి టెస్ట్‌ట్రాక్‌ కూడా ఇక్కడ ఉంది. రైలు పట్టాల్లో లోపాలు తలెత్తితే క్షణాల్లో అక్కడికి చేరుకుని మరమ్మతులు చేసే ఆధునిక మరమ్మతుల వాహనం ఉంది.
ఇంజినీరింగ్‌ అద్భుతం!
హైదరాబాద్‌ మెట్రో ప్రతిపాదన దశ నుంచే ప్రపంచాన్ని ఆకర్షించింది. ఒంటిస్తంభాల వరుసతో కట్టిన వంతెనా, స్టేషన్ల డిజైనూ వినూత్నమైనవి. నగరంలో రోడ్లు అసలే వంకర టింకరగా ఉంటాయి. వాటికి తోడు పలుచోట్ల ఫ్లైఓవర్లూ, రైలు వంతెనలూ ఉన్నాయి. వాటి పైనుంచి చాలా ఎత్తులో మెట్రో మార్గాన్ని నిర్మించడం కష్టసాధ్యమే. నిజానికి ఇది ఓ ఇంజినీరింగ్‌ అద్భుతం. అందుకే ప్రారంభం కాకముందే పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను మెట్రో సొంతం చేసుకుంది. దీని నిర్మాణంలో అడుగడుగునా అత్యంత ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానమే కన్పిస్తుంది. ప్రమాదాలకు ఆస్కారం లేని సురక్షితమైన రవాణావ్యవస్థ ఇది. ఒకవేళ సాంకేతిక లోపంతో ఎక్కడన్నా రైలు ఆగినా క్షణాల్లో సమస్యను పరిష్కరించగల సాంకేతికతా సిద్ధం. మామూలు రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు పట్టాలకు అతుకు వచ్చినప్పుడల్లా శబ్దంలో, కుదుపులో మనకు తేడా తెలిసిపోతుంది. మెట్రో రైలుపట్టాలకు అతుకులే కన్పించవు. ఏమాత్రం కుదుపుల్లేని హాయిగొలిపే ప్రయాణ అనుభూతి పొందవచ్చు. మెట్రో రైలు స్టేషన్లు చిన్నపాటి విమానాశ్రయాల్లా విశాలంగా, సౌకర్యంగా ఉంటాయి. మామూలు మెట్లతో పాటు ఎస్కలేటర్లూ లిఫ్టులూ ఉంటాయి. స్టేషన్లన్నీ సహజమైన వెలుతురు వచ్చేలా పర్యావరణహితంగా నిర్మించారు. మొత్తం 64 స్టేషన్లలో మూడు ఇంటర్‌ ఛేంజ్‌ స్టేషన్లు ఉన్నాయి. రైల్వే జంక్షన్‌లాంటివన్నమాట. ఇక్కడ రైలు మారి మరో మార్గంలో వెళ్లే రైలు ఎక్కవచ్చు. మిగిలిన స్టేషన్లను సాధారణ, ప్రత్యేక అనే రెండు రకాలుగా విభజించారు. సాధారణ స్టేషన్లలో మామూలు దుకాణాలు మాత్రమే ఉంటే హైటెక్‌ సిటీ, పంజాగుట్ట, బేగంపేట, రాయదుర్గం లాంటి ప్రత్యేక స్టేషన్లలో ఫుడ్‌కోర్టులూ సూపర్‌మార్కెట్లూ ఉంటాయి. ‘కమ్యూనికేషన్‌ బేస్డ్‌ ట్రెయిన్‌ కంట్రోల్‌ - సీబీటీసీ’ అనే అత్యాధునిక సిగ్నలింగ్‌ వ్యవస్థను దేశంలో తొలిసారి హైదరాబాద్‌లో ఉపయోగిస్తున్నారు. రైలు కోచ్‌లలో వీడియో కెమెరాలూ స్టేషన్లలో సీసీ కెమెరాలూ ఉంటాయి. కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. స్మార్ట్‌ కార్డూ టోకెన్‌ లేకుండా ఎవరూ స్టేషన్‌లోనికి ప్రవేశించడం సాధ్యం కాదు. దివ్యాంగులకు ప్రత్యేక వసతులున్నాయి. అంధులు ఎవరి సహాయమూ లేకుండా స్వయంగా స్టేషన్‌లోకి వెళ్లి టికెట్‌ తీసుకుని రైలు ఎక్కవచ్చు. మహిళలనూ మెట్రోనిర్వహణలో భాగం చేయాలని భావించిన యాజమాన్యం 20మందికి డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చింది. స్టేట్‌హోమ్‌ ప్రాంతంలో ఒక మెట్రో స్టేషన్‌ని అచ్చంగా స్త్రీలే నిర్వహించబోతున్నారు. నగరంతో విడదీయలేని అనుబంధం పెనవేసుకున్నవారంతా ఇప్పుడిక ఏ పని మీద హైదరాబాద్‌ వచ్చినా బస్సో రైలో దిగగానే నేరుగా దగ్గరలోని మెట్రో స్టేషన్‌కి వెళ్లే మార్గాలు కూడా తయారుకాబోతున్నాయి.
ఇక మెట్రో మాల్స్‌
హైదరాబాద్‌లో ఇప్పటివరకూ పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్స్‌ కొన్నే ఉన్నాయి. మెట్రోతో పాటు మరో 17 మాల్స్‌ అందుబాటులోకి రానున్నాయి. వీటికోసం 57 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. పంజాగుట్ట, హైటెక్‌ సిటీ మాల్స్‌ దాదాపుగా సిద్ధమయ్యాయి. మెట్రో రైలు దిగి షాపింగ్‌కోసం ఎక్కడిదాకానో వెళ్లక్కరలేదిక. స్టేషన్‌కి ఆనుకుని ఉన్న మాల్‌లో షాపింగ్‌ చేసి మళ్లీ రైలెక్కి గమ్యానికి చేరుకోవచ్చు. మెట్రో స్టేషన్లకు అనుసంధానంగా వైవిధ్యమైన ఆకృతుల్లో విశాలంగా పర్యటకుల్ని ఆకట్టుకునేలా ఇవి ముస్తాబవుతున్నాయి. ఏటీఎం, నిత్యావసరాలూ మందుల దుకాణాలూ కూరగాయలతో మొదలుపెట్టి ఫుడ్‌ కోర్టులూ పాలీ క్లినిక్‌ల వరకూ ఈ మాల్స్‌లో ఉంటాయి. ‘హైదరాబాద్‌ నెక్ట్స్‌’ పేరుతో రిటైల్‌ దుకాణాలను ఏర్పాటుచేస్తున్నారు. ఒక్క దుకాణాలే కాదు, వినోదానికి మల్టీప్లెక్సులూ రెస్టరెంట్లూ గేమింగ్‌ సౌకర్యాలూ ఉంటాయి. పెద్ద మాల్స్‌లో పర్యటకుల తాత్కాలిక నివాసానికి వీలుగా భవిష్యత్తులో హోటళ్లూ సర్వీస్‌ అపార్టుమెంట్లూ కూడా నిర్మించే ప్రతిపాదన ఉంది. కన్వెన్షన్‌ సెంటర్లూ థీమ్‌ పార్కులూ వంటివి కూడా వీటిల్లో ఏర్పాటుచేయనున్నారు. మాల్స్‌ వరకూ వెళ్లక్కరలేకుండానే ప్రతి స్టేషన్లోనూ కూడా నిత్యావసర వస్తువులూ కూరగాయలూ మందులూ స్టేషనరీ లాంటివి అమ్మే సాధారణ దుకాణాలు ఉంటాయి.
తెలుగువారి సత్తా చాటాం
తెలుగువారి చిరకాల వాంఛ నెరవేర్చగలిగినందుకు తనకెంతో సంతోషంగా ఉందంటారు మెట్రోరైల్‌ ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి. ఆయనేమంటున్నారంటే...
‘హైదరాబాద్‌ నగరానికి మెట్రో రైలు కావాలన్న ఆకాంక్ష ఇప్పటిది కాదు. ఏ ప్రాజెక్టు చేపట్టినా పూర్తవడానికి దశాబ్దాలు పడుతున్న రోజుల్లో శ్రీధరన్‌ కృషితో ఆరున్నరేళ్లలోనే సాకారమైన దిల్లీ మెట్రో ఆ ఆకాంక్షకు రెక్కలు తొడిగింది. ఎస్పీ సింగ్‌తో కలిసి నేను హైదరాబాద్‌ నగరపాలక సంస్థలో పనిచేస్తున్నపుడు మెట్రో రైలు ప్రతిపాదనను అప్పటి సీఎం వైఎస్‌ ముందు ఉంచాం. అయితే అందుకు చాలా డబ్బు కావాలనీ మన ప్రాధాన్యాలు వేరనీ అన్నారాయన. అప్పుడే పీపీపీ పద్ధతి గురించి ఆలోచించాం. దానికైతే రాష్ట్ర ప్రభుత్వంపైన అంత భారం పడదని భావించిన నేను ప్రతిపాదనను ముందుకు కదిలించాను. నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ భారతీయుల సత్తా చాటాలంటూ మమ్మల్ని ప్రోత్సహించారు. అది మా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఎవరో ఒకరు రిస్క్‌ తీసుకుని ముందడుగు వేయకపోతే చరిత్రలో అభివృద్ధి ఏదీ జరిగేది కాదు. అందుకే ధైర్యం చేశాం. మా ప్రణాళిక విని చాలా మంది పెదవి విరిచారు. ప్రపంచంలో ఎక్కడా జరగనిది ఇక్కడ మాత్రం ఎలా జరుగుతుందంటూ కొట్టిపడేశారు. వారన్న అసాధ్యాన్ని మేము సుసాధ్యం చేసి చూపించాం. తెలుగువారి సత్తా చాటాం.
మెట్రో కేవలం ఒక రవాణా మార్గమే కాదు, దీన్ని ఒక జీవనవిధానంగా మేము మార్చబోతున్నాం. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి నగర పునరుజ్జీవనం అనే విస్తృతప్రయోజనానికి మెట్రో రైలును ఒక సాధనంగా వాడుకుంటున్నాం. త్వరలోనే ఆ మార్పులన్నీ మీరు చూస్తారు. హైదరాబాద్‌ ఇంతందంగా ఉంటుందా అనుకుంటారు. నగరమూ దాని రోడ్లూ కార్ల కోసం మాత్రమే కాదు, సామాన్యులూ వృద్ధులూ స్త్రీలూ పిల్లలూ దివ్యాంగులూ... అందరి కోసం. అలాగే మెట్రో స్టేషన్‌ రైలు ఎక్కడానికి మాత్రమే కాదు, ఇక్కడ ఇంకా చాలా పనులు చేయవచ్చు. ఆహ్లాదంగా కాసేపు గడపగల పబ్లిక్‌ స్పేస్‌గా దీన్ని తయారుచేస్తాం. అందమైన ఫుట్‌పాత్‌లూ, పచ్చదనమూ, కూర్చోవడానికి బెంచీలతో స్టేషన్‌ పరిసరాలు అందరినీ ఆకట్టుకుంటాయి. నిత్యావసరాలూ మందులూ అన్నీ స్టేషన్లోనే కొనుక్కోవచ్చు. అవసరమైతే మాల్‌లో షాపింగ్‌ చేయొచ్చు. స్నేహితులతో కలిసి సరదాగా సినిమా చూడవచ్చు. ఇంత ఆధునికంగా నిర్మించిన మెట్రో ప్రపంచంలో మరెక్కడా లేదు. ఇతర ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు నగరంతో ఏమాత్రం సంబంధంలేని రాజభవనాల్లా ఉంటాయి. ఇక్కడ నగరంలో అవీ ఒక భాగంగా ఇమిడేలా పరిసరాలను అభివృద్ధి చేస్తున్నాం.
ఇంత పెట్టుబడి పెట్టి కట్టిన మెట్రోకి లాభాలు ఎలా వస్తాయన్నది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ప్రపంచంలో దాదాపు 250 నగరాల్లో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. వాటన్నిటినీ అక్కడి ప్రభుత్వాలే నిర్మించి నిర్వహిస్తున్నాయి. సింగపూర్‌, హాంకాంగ్‌, జపాన్‌, తైపీ... ఈ నాలుగు మాత్రమే రియల్‌ ఎస్టేట్‌తో అనుసంధానించడం వల్ల లాభాలు పొందుతున్నాయి. వాటినే ఆదర్శంగా తీసుకుని మన మెట్రో ప్రణాళికను రూపొందించాం. ప్రతి స్టేషన్‌లోనూ 20శాతం స్థలాన్ని వ్యాపారానికి ఉపయోగిస్తున్నాం. వీటికి తోడు మాల్స్‌ కూడా ఉన్నాయి. కాబట్టి ఆదాయవనరులకు ఢోకా ఉండదు. సమయం కలిసివచ్చే సురక్షితమైన ప్రయాణమూ అన్ని రకాల సౌకర్యాలతో ఆహ్లాదకరమైన అనుభూతీ మెట్రోతో ప్రజలకు మేం ఇస్తున్న కానుకలు. హైదరాబాద్‌ని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నం మేం చేస్తున్నాం. ప్రజలనుంచీ కూడా మేము అదే స్థాయి సహకారాన్ని ఆశిస్తున్నాం.’
ఆవిష్కరణకు శరవేగంతో సిద్ధమవుతున్న మెట్రో జంటనగరాల ప్రజల్లో రేపుతున్న ఆసక్తి అంతా ఇంతా కాదు. కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న మెట్రో నిర్మాణ పనుల వల్ల అసలే ఇరుగ్గా ఉండే నగర రహదారులు మరింత సమస్యాత్మకంగా మారాయి. మెట్రో పూర్తయితే సమస్యలు తీరతాయని భావించి ఓపికగా ఎదురుచూసిన ఫలితం ఇప్పుడు కన్పించనుంది.
అతి త్వరలోనే భాగ్యనగరవాసుల జీవితాలు మెట్రోతో అనుసంధానం కాబోతున్నాయి. ముంబయి ప్రజల జీవితాల్లో సబర్బన్‌ రైళ్లు ఎలాగైతే విడదీయలేని భాగమయ్యాయో అదే రీతిలో హైదరాబాద్‌ ప్రజల జీవితాలతో మెట్రో మమేకం కానుంది. ఠంచనుగా సమయానికి వచ్చే మెట్రో రైలు స్టేషన్లో 20 సెకన్లే ఆగుతుంది. అది మిస్‌ కాకూడదనుకుంటే పొద్దున్నే ఉరుకులు పరుగులు తప్పవు. అయితే ప్రయాణ సమయం బాగా కలిసొస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా దినచర్యను ప్లాన్‌చేసుకునే వీలుంది. రోజూ మెట్రోలో ప్రయాణించేవారికి మరో స్మార్ట్‌ కార్డు అదనంగా చేరుతుంది. అప్పుడప్పుడూ వెళ్లే వారు మాత్రం టోకెన్‌ తీసుకోవాలి. తిరుగు ప్రయాణంలో రైలు దిగి స్టేషన్లోనే ఇంటికి అవసరమైన వస్తువులను కొనుక్కోవచ్చు. మెట్రో స్టేషన్ల పరిసరాలు అందంగా ఆహ్లాదంగా ఉద్యానవనాలను తలపించబోతున్నాయి. అందమైన ఫుట్‌పాత్‌లూ పచ్చని చెట్లూ కూర్చోవడానికి బల్లలూ ఉన్న స్టేషన్ల ఆవరణల్లో కాసేపు ప్రశాంతంగా సేదదీరవచ్చు.
గంటసేపు వెయిట్‌ చేశాక వరసగా క్యూకట్టినట్లు వచ్చే ఆర్టీసీ బస్సుల మీద వైరాగ్యమూ... గతుకుల రోడ్లూ కుదుపుల ప్రయాణాలూ... అన్నిటికీ ఇక సెలవిచ్చేసి దుమ్మూ ధూళీ లేని ఏసీ చల్లదనంలో అలసట లేని ప్రయాణాన్నీ, కిటికీల్లోంచి కన్పించే నగర అందాల్నీ ఆస్వాదిస్తూ... ‘రిమ్‌ జిమ్‌ రిమ్‌ జిమ్‌ హైదరాబాద్‌... మెట్రో రైలూ జిందాబాద్‌...’ అని పాడుకుంటూ హాయిగా మెట్రో రైల్లో తిరిగేద్దాం రండి!


  • క‌వర్ స్టోరీ

No comments:

Post a Comment

Google bans crypto-currency adverts

Google bans crypto-currency adverts